: భక్తిరస సినిమాలతో డబ్బులు రావని తెలుసు: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
భక్తి ప్రధాన సినిమాలు తీస్తే డబ్బులు రావన్న సంగతి తనకు తెలుసునని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వ్యాఖ్యానించారు. ద్వారకా తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న ఆయన, మీడియాతో మాట్లాడారు. సినీ ప్రేక్షకులు కాలక్షేపం కోసం , కాసేపు ఆనందించేందుకు సినిమాలకు వస్తారని, దైవ భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు ఆలయాలకు వెళ్తారని చెప్పారు. స్వామివారి అనుగ్రహం ఉంటే, ద్వారకా తిరుమలపైనా ఓ చిత్రాన్ని తీస్తానని చెప్పారు.
అన్నమయ్యకు, ఓం నమో వెంకటేశాయ చిత్రానికి మధ్య టెక్నాలజీ పరంగా ఎంతో తేడా ఉందని అన్నారు. అదే సాంకేతికతను వినియోగిస్తూ, టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీబీసీ చానల్ ను అభివృద్ధి చేస్తున్నానని, భక్తుల కోసం పలు కొత్త కార్యక్రమాలను రూపొందిస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకూ 108 సినిమాలకు తాను దర్శకత్వం వహించానని, 80 శాతం సినిమాలు హిట్ అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం మాత్రం లాభాపేక్షను దృష్టిలో పెట్టుకోకుండా ఆధ్యాత్మిక చిత్రాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు.