: రైల్వే జోన్ ఇస్తారనే నమ్మకం ఉంది: సుజనా చౌదరి


రైల్వే జోన్ ఏర్పాటు ఆర్థికంగా సాధ్యం కాదని అధికారులు చెప్పిన మాటమే వాస్తవమే అయినప్పటికీ, ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని రైల్వే జోన్ ఇవ్వాల్సిందేనని.. ఇస్తారనే నమ్మకం తమకు ఉందని కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి నివాసంలో రెండు గంటల పాటు నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన నిధులను రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

పెండింగ్ అంశాల విషయమై ఎంపీలు బృందాల వారీగా కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించామని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని రేపు కలవనున్నామని, ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ చట్టబద్ధతకు కేబినెట్ ఆమోదంపై ఆయనతో చర్చిస్తామని అన్నారు. టీడీపీ పార్లమెంటరీ సమావేశానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, టీడీపీ పార్లమెంటరీ నేత తోట నర్సింహం, పలువురు ఎంపీలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News