: కాంగ్రెస్ తో పొత్తుపై రుసరుసలాడుతున్న సమాజ్ వాదీ పార్టీ నేతలు!

ఉత్తరప్రదేశ్ లో అత్యధిక స్థానాలు బీజేపీకి దక్కనున్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి కావడంతో సమాజ్ వాదీ పార్టీలోని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ లో ఇలాంటి ఫలితాలు రావడానికి కారణం కాంగ్రెస్ తో పొత్తేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు తమ కొంప ముంచిందని ఆవేదన చెందుతున్న ఎస్పీ నాయకులు, ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు అంగీకరించిన ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ పై రుసరుసలాడుతున్నారు.

దీనిపై ఎస్పీ సీనియర్ నేత రవిదాస్ మెహ్రోత్రా మాట్లాడుతూ, కాంగ్రెస్ తో పొత్తు వల్ల సమాజ్ వాదీకి ఎలాంటి లాభం చేకూరలేదని అన్నారు. ఈ పోత్తు వల్ల లాభపడింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ సమాజ్ వాదీ అభ్యర్థులను ఓడించే ప్రయత్నం చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ తో కాకుండా సొంతంగా పోటీ చేసి ఉంటే విజయం సాధించి ఉండేవారమని తెలిపారు. తమ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పని చేయడం వల్లే బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకోనుందని ఆయన పేర్కొన్నారు. 

More Telugu News