: చైనా సరికొత్త స్కెచ్... తీవ్ర ఆందోళనలో ఇండియా!
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా, ఇండియాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను అడ్డుకోవడంతో పాటు, తనకు మిత్రులుగా ఉన్న పాకిస్థాన్, శ్రీలంకలతో పాటు, అమెరికా పక్కనే బల్లెంలా ఉన్న మెక్సికోను చేరదీసేందుకు చైనా వేసిన సరికొత్త ప్లాన్ తో ఇండియా ఆందోళన చెందుతోంది. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాల కూటమి స్థానంలో 'బ్రిక్స్ ప్లస్' పేరిట మరిన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలను కలిపి, ఓ కూటమిని ఏర్పాటు చేయాలన్నది చైనా ఆలోచన. ఇదే జరిగితే, బ్రిక్స్ దేశాల్లో అధిక నష్టం ఇండియాకేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిక్స్ బ్యాంకు ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇండియాలో జరుగుతుండగా, వాటికి నిధుల కొరత ఏర్పడుతుంది.
ఇక బ్రిక్స్ ప్లస్ ఏర్పడితే, చైనా రాజకీయంగా మరింత బలపడుతుంది. ఇక తమ దేశం ఈ కొత్త ఆలోచనతో ఉందని, పలు దేశాలతో సంప్రదింపులు కూడా మొదలయ్యాయని, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మీడియాకు వెల్లడించారు. అయితే, బ్రిక్స్ ప్లస్ కూటమిని ఏర్పాటు చేయాలంటే, భారత్ అనుమతి కూడా తప్పనిసరి. అయితే, తమ ఆలోచనకు ఇండియా మద్దతు ఇవ్వక పోవచ్చన్న ఆలోచనలో కూడా చైనా ఉన్నట్టు సమాచారం.