: జయలలిత అండతో రెచ్చిపోయిన మహిళా ఐఏఎస్ అధికారికి ఝలక్కిచ్చిన మంత్రి!


దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆంటీ అని పిలవగలిగేంత చనువున్న ఐఏఎస్ అధికారి సబితకు విద్యాశాఖా మంత్రి సెంగొటయ్యన్ షాకిచ్చారు. జయ అండతో ఆడిందే ఆటగా, పాడిందే పాటగా ఆరేళ్లపాటు అధికారం చలాయించిన సబితపై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. ముఖ్యమంత్రి పళనిస్వామి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా సోమవారం 17 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. బదిలీ అయిన 17 మందిలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న సబిత‌ను సిమెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ బదిలీ చేశారు.

విద్యాశాఖను ఆరేళ్లపాటు తన గుప్పిట్లో పెట్టుకున్న సబితపై వేటు పడడంతో మిగతా ఐఏఎస్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జయకు అత్యంత సన్నిహితురాలైన సబితను పళని ప్రభుత్వం కదిపే అవకాశం లేదని అందరూ భావించారు. ఐఏఎస్ అధికారులంతా జయను మేడమ్ అని పిలిస్తే సబిత మాత్రం ఆంటీ అని పిలిచేవారు. జయ పాల్గొనే కార్యక్రమాల్లో ఆమె హల్‌చల్ చేసేవారు. ఒకానొక దశలో జయలలితకు ప్రత్యేక కార్యదర్శిగా సబిత నియమితులవుతారని భావించారు.

విద్యాశాఖా మంత్రులు మారినా ఆరేళ్లపాటు సబిత అదే కుర్చీని అంటిపెట్టుకుని ఉండడం గమనార్హం. ఏ ఒక్క  మంత్రీ ఆమె అధికారాల్లో వేలు పెట్టడానికి సాహసించలేకపోయారు. అయితే పళనిస్వామి ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీ సీనియర్ నేత సెంగొట్టయ్యన్ విద్యాశాఖామంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో సబిత అధికారాలకు బ్రేక్ పడింది. ఒకానొక దశలో మంత్రికి, సబితకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే జరిగింది. చివరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌పై మంత్రి పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది. సబిత బదిలీతో ఇతర ఐఏఎస్ అధికారులు లోలోపల ఆనందిస్తున్నారు. అయితే విద్యాశాఖకు తప్పిన గండం ఇప్పుడు సిమెంట్ శాఖకు చుట్టుకుందని పలువురు జోకులు వేస్తున్నారు.

  • Loading...

More Telugu News