: పవన్ కల్యాణ్ వినతిపై స్పందించిన మంత్రి గంటా!
నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తికి ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈ యూనివర్శిటీలో నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని గంటా శ్రీనివాసరావు ఈ రోజు సందర్శించారు. వర్శిటీ వైస్ ఛాన్స్ లర్ వీరయ్య, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. యూనివర్శిటీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ యూనివర్శిటీలో సమస్యలు ఉన్న విషయం వాస్తవమేనని, అయితే, కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయని అన్నారు. వారం రోజుల్లో కొత్త యూనివర్శిటీలో పరిపాలన, తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపడుతున్నామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. కాగా, ఇటీవల పలు విద్యార్థి సంఘాల నేతలు పవన్ కల్యాణ్ ను కలిసి విక్రమ సింహపురి యూనివర్శిటీలో సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే మంత్రి గంటా ఆ యూనివర్శిటీకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు.