: ఈసారి పకడ్బందీగా నిషేధం విధించనున్న ట్రంప్...నేడే ముహూర్తం
ఇరాన్, సిరియా, ఇరాక్, లిబియా, యెమెన్, సూడాన్, సొమాలియా ముస్లిం దేశాలపై ఈసారి పకడ్బందీ నిషేధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పావులు కదిపారు. జనవరి 27న ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం పెను కలకలం రేపింది. ఆ వెంటనే ఆయన జారీచేసిన కార్యనిర్వాహక ఆదేశం అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్లిన అమెరికన్లను, అమెరికాలో ఉంటున్న ఇతర దేశాల వారిని ఆందోళనలోకి నెట్టింది. ప్రధానంగా వీసా నిబంధనలు అంగీకరించినా, అమెరికా నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లిన వారిని వణికించాయి. దీంతో ట్రంప్ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వలసదారులను అక్రమ ప్రవేశం పేరిట ఎయిర్ పోర్టుల వద్దే అడ్డుకోవడం, వారిని స్వదేశాలకు పంపేయడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఫెడరల్ న్యాయస్థానం కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా, ఫెడరల్ అప్పీల్ కోర్టు ట్రంప్ ఆదేశాలను నిలుపుదల చేస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈసారి అలాంటి అడ్డంకులేమీ లేకుండా తన నిషేధం నిర్ణయాన్ని అమలు చేయడానికి ట్రంప్ ఉద్యుక్తులయ్యారు. దీంతో న్యాయ ప్రతిబంధకాలు లేకుండా కొత్త ఉత్తర్వును రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఉత్తర్వులపై ఆయన నేడు సంతకం చేయనున్నారు. ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై నియంత్రణలు పెట్టిన ట్రంప్ వలస విధానం నిషేధం మరింత అగ్గిరేపనుంది. అయితే, జనవరి 27న ఆయన జారీ చేసిన ఉత్తర్వులంత కఠినంగా ఈసారి జారీ చేసే ఆదేశాలు ఉండకపోవచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా గతంలోలా అమెరికా వీసా ఉన్నవారెవరినీ అడ్డుకోరని, సిరియా శరణార్థులపై వివక్ష ఉండదని తెలుస్తోంది.