: ఆనాడు నా భర్త నా మాట వినకుండా వెళ్లారు... లక్ష్మీపార్వతి, వైస్రాయ్ కూడా ఎన్టీఆర్ చరిత్రలో భాగమే: పురందేశ్వరి
ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మిపార్వతితో వివాహం, ఆపై వైస్రాయ్ హోటల్ వేదికగా సాగిన ఘటనలు కూడా ఓ భాగమేనని, తప్పయినా, ఒప్పయినా నాటి సంఘటనలను కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్రలో చూపించాల్సి వుంటుందని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, వైస్రాయ్ హోటల్ కు వెళ్లి, తన తండ్రికి అన్యాయం చేయవద్దని ఆనాడు తన భర్త వెంకటేశ్వరరావును వారించానని, కానీ అప్పట్లో ఆయన వినిపించుకోలేదని అన్నారు. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పానని తెలిపారు.
"ఆయన పెళ్లి చేసుకోవడం తప్పు అని నేను భావించలేదు. ఆయన ఎవరిని చేసుకున్నారన్నది... ఆ విషయానికి వస్తే ఎవరికి ఉండేటువంటి ఆలోచన వారికి ఉంటుంది. నాకు సంబంధించినంత వరకూ ఆయన తీసుకున్న ఛాయిస్ ను నేను యాక్సెప్ట్ చేయలేదు. ఆయన పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని డెఫినెట్ గా యాక్సెప్ట్ చేయాల్సిందే" అని వ్యాఖ్యానించారు.
వైస్రాయ్ ఘటన జరిగిన సమయంలో చంద్రబాబు, బాలయ్య, తన భర్త వెంకటేశ్వరరావు అందరూ ఇంట్లోనే ఉండి మాట్లాడుకున్నారని, ఆపై తన భర్తను చంద్రబాబు వైస్రాయ్ కి తీసుకు వెళ్లారని చెప్పారు. కనుక వీరందరిదీ నాటి ఘటనలో బాధ్యతాయుతమైన పాత్రేనని, ఇవన్నీ కూడా బాలయ్య రేపు తన సినిమాలో చూపించాల్సిందేనని అన్నారు. ఈ సినిమాలో విలన్ ఉండరని, వాస్తవాలను చూపిస్తే, ప్రజలు సినిమాను చూసి, విలన్ ఎవరో డిసైడ్ చేసుకుంటారని అభిప్రాయపడ్డారు.