: వలసల నిషేధ ఉత్తర్వులపై నేడు మళ్లీ సంతకం చేయనున్న ట్రంప్
ఇరాన్, ఇరాక్, లిబియా, సూడాన్, సోమాలియా, సిరియా, యెమన్ దేశాల నుంచి వలసలను నిషేధించే ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా నేడు (సోమవారం) మరోమారు సంతకం చేయనున్నారు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ జనవరి 27న ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశం జారీ చేశారు. ఆయన ఆదేశంతో ప్రపంచం మొత్తం వణికింది. అంతేకాదు ట్రంప్‌పై విమర్శల జడివాన కూడా కురిసింది. అమెరికా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అయినా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే ట్రంప్ జోరుకు ఫెడరల్ అప్పీల్ కోర్టు బ్రేకులు వేసింది. దీంతో న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త ఉత్తర్వులను రూపొందించారు. అయితే అందులో ఏముందన్నది ఇప్పటి వరకు తెలియరాలేదు. అయితే గత ఉత్తర్వులంత కఠినంగా మాత్రం ఉండకపోవచ్చని సమాచారం. ఈసారి నిబంధనల్లో సిరియా శరణార్థులపై కనికరం చూపినట్టు తెలుస్తోంది.