: పాక్ క్రికెట్ బోర్డుతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న మిస్బా
పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ గా తనను కొనసాగిస్తారా? లేక తన స్థానంలో మరెవరినైనా ఎంపిక చేస్తారా? అనే విషయంలో పాక్ క్రికెట్ బోర్డుతో తేల్చుకోవడానికి మిస్బా ఉల్ హక్ సిద్ధమయ్యాడు. మరో రెండు రోజుల్లో పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ తో వ్యక్తిగతంగా భేటీ అవుతానని.... తన కెప్టెన్సీపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఆయననే కోరుతానని చెప్పాడు. కొన్ని రోజుల్లో వెస్టిండీస్ తో సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో, పాక్ కెప్టెన్ విషయంలో సందిగ్ధత నెలకొంది.
విండీస్ తో జరిగే వన్డే సిరీస్ కు ఆటగాడిగా తాను అందుబాటులోనే ఉంటానని... అయితే, కెప్టెన్ తానే ఉంటానా? లేదా? అనే విషయమే తేలాల్సి ఉందని మిస్బా చెప్పాడు. కెప్టెన్సీ పదవి నుంచి మిస్బాను తప్పిస్తున్నారన్న వార్తల నేపథ్యలో, కొన్ని రోజుల క్రితం మిస్బా మాట్లాడుతూ, కెప్టెన్సీ పదవి నుంచి తానెందుకు తప్పుకోవాలని ప్రశ్నించాడు. అసలు తన అవసరం పాక్ క్రికెట్ బోర్డుకు ఉందా? లేదా? అనే విషయాన్ని కూడా మిస్బా తేల్చుకోవాలనుకున్నాడు.