: కేబినెట్ మీటింగ్ లా లేదు.. సినిమా థియేటర్ లో భేటీలా ఉంది!: రోజా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. అది మంత్రివర్గ సమావేశమా? లేక సినిమా థియేటరా? అని ఆమె ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని చూసి రాష్ట్ర మంత్రివర్గ నేతలు భయపడుతున్నారని అన్నారు. బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో నందిగామలో కలెక్టర్ ఎ.బాబు, జగన్ మధ్య జరిగిన వాగ్వివాదాన్ని ఆ సమావేశంలో వీడియో వేసుకుని చూశారని వ్యాఖ్యానించిన రోజా... దీంతో ఆ భేటీ సినిమా థియేటర్లో కూర్చున్న విధంగా ఉందని చురకలు అంటించారు. కృష్ణా జిల్లా ముళ్లపాడు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 11మంది కుటుంబాలకు నష్టపరిహారం అంశంపై మంత్రివర్గ సమావేశంలో ఎందుకు తీర్మానం చేయలేదని ఆమె నిలదీశారు. అంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ట్రావెల్స్‌పై కూడా చర్చించకపోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు.