: హరియాణా మాజీ ముఖ్యమంత్రికి హైకోర్టు షాక్.. వెంటనే లొంగిపోవాలని ఆదేశం
హరియాణా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా(82)కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయన పెరోల్‌ను రద్దు చేసిన కోర్టు వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్‌డీ) చీఫ్ అయిన చౌతాలాకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే అనారోగ్య కారణాలతో గతనెల 6న పెరోల్‌పై బయటకు వచ్చారు.
అనారోగ్య కారణాలు చూపి బయటకు వచ్చిన చౌతాలా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని, తన పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారంటూ దినపత్రికల్లో వచ్చిన వార్తా క్లిప్పింగులతో ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. వీటిని పరిశీలించిన కోర్టు చౌతాలా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనారోగ్య కారణాలను చూపి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ చౌతాలాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకిచ్చిన పెరోల్‌ను రద్దు చేసింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది.