: ఓపక్క ప్రస్తుత భార్య.. మరోపక్క మాజీ భార్య.. అమేథిలో కాంగ్రెస్ నేత పరిస్థితిని చూసి జాలిపడ్డ ఓటర్లు!
ఉత్తర ప్రదేశ్ లోని అమేథిలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ను చూసి అక్కడి ఓటర్లు ‘అయ్యో, పాపం’ అనుకున్నారట. ఎందుకంటే, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథి నియోజకవర్గం నుంచి సంజయ్ సింగ్ భార్య అమితా సింగ్, మాజీ భార్య గరిమా సింగ్ లు బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అమితా సింగ్, బీజేపీ తరపున గరిమా సింగ్ తలపడ్డారు.
ఈ ఎన్నికల్లో తన భార్య అమితా సింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదని భావిస్తున్న సంజయ్ సింగ్, స్వయంగా ఆయనే ఎన్నికల ప్రచారం చేశారు. బీజేపీని తూర్పారబడుతున్న ఆయన, తన మాజీ భార్యను మాత్రం పల్లెత్తు మాట అనకుండా తన ఎన్నికల ప్రచారం కొనసాగించారు. తన భార్యను గెలిపించమంటూ ఓపక్క ఓట్లు అడుగుతూ, తన మాజీ భార్యను ఏమాత్రం విమర్శించకుండా ఎన్నికల ప్రచారం చేసిన సంజయ్ సింగ్ పరిస్థితిని గమనించిన ఓటర్లు ‘అయ్యో, పాపం’ అనుకున్నారట. కాగా, అమేథి నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరిగాయి.