: ఇంతకు ముందు సీఎం అవుతానని బెదిరించావు.. ఇప్పుడు ఇలా అంటున్నావు!: జగన్ పై సోమిరెడ్డి ఆగ్రహం
నిన్న కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వాసుపత్రిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ... ‘ఇంతకు ముందు జగన్ సీఎం అయి అంతు చూస్తా’ అని పోలీసులని బెదిరించాడని, ఇప్పుడు కలెక్టర్ ని సెంట్రల్ జైలుకి పంపిస్తానని అంటున్నారని సోమిరెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు ప్రవర్తించే తీరు ఇదేనా? అని ఆయన అన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్యులపై ఇలా రౌడీయిజాన్ని ప్రదర్శించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
వైద్యుడి చేతిలో ఉన్న నివేదికను లాక్కుంటావా? అని జగన్ ని సోమిరెడ్డి నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఓ లేఖ రాసి దానిపై నివేదిక అందించాలని కోరే హక్కు జగన్ కి ఉందని, అలా చట్టబద్ధంగా వ్యవహరించాలి కానీ ఇలా దౌర్జన్యం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. జగన్ ఫ్రస్టేషన్లో ఉన్నారని ఆయన ఆరోపించారు. జగన్ మీద శశికళపైన పెట్టిన సెక్షన్ల పైనే కేసులు ఉన్నాయి.. ఆమెకన్నా జగన్ మరింత ఎక్కువ కేసుల్లో ఉన్నారు.. శశికళ 60 కోట్ల రూపాయల ఆస్తుల్లో దోషయితే జగన్ 40 వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసుల్లో నిందితుడని ఆయన అన్నారు.
‘జగన్, రోజుకో మాట మాట్లాడుతున్నావు.. నిన్న ముఖ్యమంత్రిని తిట్టావు.. ఇప్పుడు కానిస్టేబుల్ దగ్గర్నుంచి ఐఏఎస్ వరకు అంతా అవినీతిపరులే అంటున్నావు... నీకు అందరూ అలాగే కనపడుతున్నారు... నువ్వు అవినీతి పరుడివి కావడం వల్లే అందర్నీ అవినీతి పరుడు అంటున్నావు... ప్రజల కోసం పనిచేసే వారిని కించపరుస్తున్నావు.. అందుకే, జగన్ మీద చర్యలు తీసుకోకపోతే ఇష్టం వచ్చిన మాట మాట్లాడుతూ ఇంకా నీచంగా ప్రవర్తిస్తాడు.. జగన్ పైనే కాకుండా రోజా, శ్రీకాంత్ రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలి... వారు వాడుతున్న భాష బాగోలేదు. అసలు సజావుగా పరిపాలన జరగనివ్వరా?’ అని సోమిరెడ్డి ప్రశ్నించారు.