: వృద్ధి రేటుపై కనిపించని నోట్ల రద్దు ప్రభావం... ఎగిరి దుమికిన మార్కెట్ బుల్
గత సంవత్సరం భారత ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు తరువాత ఆర్థిక వ్యవస్థేమీ అనుకున్నంతగా కుదేలు కాలేదన్న సంకేతాలు వెలువడిన వేళ, స్టాక్ మార్కెట్ బుల్ హై జంప్ చేసింది. గడచిన అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి 7 శాతం మేరకు పెరిగిందన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను ఒక్కసారిగా పెంచడంతో బుధవారం నాటి మార్కెట్ సెషన్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పెరిగింది.
ఇదే సమయంలో ఏప్రిల్ - జనవరి ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాలకన్నా మరింతగా పెరగనుందని వచ్చిన వార్తలు కాపిటల్ మార్కెట్ లాభాలను కొంతమేరకు అడ్డుకున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఈ ఉదయం 11:40 గంటల సమయంలో సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 196 పాయింట్ల లాభంతో 28,939 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51 పాయింట్ల వృద్ధితో 8,931 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ 0.7 శాతం పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్, హీరో మోటో, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర సంస్థలు లాభాల్లో నడుస్తుండగా, టాటా మోటార్స్ నష్టంలో ఉంది.