: ఇరాక్ పై మారిన ట్రంప్... తాజా ఉత్తర్వుల్లో నిషేధం నుంచి మినహాయింపు!
ఇరాక్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నట్టు తెలుస్తోంది. తన తదుపరి 'ప్రయాణ నిషేధ' కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ఇరాక్ కు మినహాయింపు లభించనుందని అధికారులు వెల్లడించినట్టు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. వలసదారులను అడ్డుకునేందుకు ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఉత్తర్వుల్లో తాత్కాలిక ప్రయాణ నిషేధం విధిస్తున్న ముస్లిం దేశాల జాబితా నుంచి ఇరాక్ పేరును తొలగించనున్నట్టు సమాచారం.
కాగా, కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై నేడు ట్రంప్ సంతకం చేసే అవకాశాలు ఉన్నట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇరాక్ కు మినహాయింపు ఇవ్వాలని పెంటగాన్, స్టేట్ డిపార్ట్ మెంట్ నుంచి ఒత్తిడి వచ్చినట్టు అధికారులు వెల్లడించారని, అందువల్లే ట్రంప్ కొంత మేరకు తన వైఖరిని మార్చుకున్నారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఉగ్రవాదులతో తాము చేస్తున్న పోరాటానికి ఇరాక్ మద్దతిస్తున్నందునే ఆ దేశంపై ఉన్న నిషేధపు ఉత్తర్వులను సవరిస్తున్నట్టు పేర్కొంది.