: షాపింగ్ మూడ్ లో భారత సైన్యం... మరిన్ని విధ్వంసక ఆయుధాలతో తిరుగులేని శక్తిగా అవతరణ!

దాదాపు 13 లక్షల మందికి పైగా ప్రత్యేక సాయుధ దళాన్ని కలిగివున్నప్పటికీ, యుద్ధం చేయాల్సి వస్తే, పట్టుమని నెల రోజులైనా నిలిచేందుకు సరిపడా మందుగుండు లేని భారత సైన్యం, ఇప్పుడు తిరుగులేని శక్తిగా అవతరించాలన్నదే లక్ష్యంగా, అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. జూన్ 2015లో మయన్మార్ లో, ఆపై గత సంవత్సరం సెప్టెంబరులో పాక్ ఆక్రమిత కాశ్మీరులో సర్జికల్ దాడుల తరువాత, సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో మరింత విధ్వంసక, అత్యాధునిక ఆయుధాలు కావాలని ఆర్మీ కోరిన సంగతి తెలిసిందే. ఇక సరికొత్త అసాల్ట్ రైఫిల్స్, స్నిప్పర్ రైఫిల్స్, మెషిన్ గన్స్, లైట్ వెయిట్ రాకెట్ లాంచర్లు, షాట్ గన్స్, పిస్టల్స్, నైట్ విజన్ పరికరాలతో పాటు మందుగుండు కొనుగోలుకు ఎంపిక చేసిన విదేశీ ఆయుధ కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

గత వారంలో అమెరికా, ఇజ్రాయిల్, స్వీడన్ తదితర దేశాల కంపెనీలకు ఆర్పీఎఫ్ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)లను పంపామని, ఆయుధాల కొనుగోలు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నది తమ ఉద్దేశమని ఓ అధికారి వెల్లడించారు. ఏ ప్రాంతంలోని సైన్యాన్నయినా సులువుగా తరలించేందుకు వీలు కలిగేలా హెలికాప్టర్లలో తీసుకెళ్లగల 120 లైట్ స్ట్రయిక్ వాహనాలను కూడా కొనుగోలు చేయనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం రూ. 20 వేల కోట్లతో ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు మందుగుండు కొనుగోలుకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ఆయుధ కంపెనీల నుంచి కొత్త ఆయుధాల శాంపిల్స్ తీసుకుని పరీక్షించిన తరువాత, సంతృప్తి చెందితే, భారీ ఎత్తున ఆర్డర్లు ఇస్తామని స్పష్టం చేశారు.

More Telugu News