: జర భద్రం.. ఈసారి నెత్తిపై నిప్పులే.. వడగాల్పులు అధికమంటున్న వాతావరణశాఖ!
అవును! ఈసారి చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. బయటకు వెళ్లేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈసారి భానుడు నిప్పులు కురిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ వేసవిలో కనీవిని ఎరుగని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేనేజ్‌మెంట్ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశాల్లో కొంత ఎక్కువగా.. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ఈసారి తెలంగాణలో సాధారణం కంటే 47 శాతం అధికంగా వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఎల్‌నినో, లానినోల ప్రభావంపై స్పష్టత లేదని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, అడవులు అంతరించి పోవడం, గ్లోబల్ వార్మింగ్ తదితర కారణాల వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆయన వివరించారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా సూర్యుడు మండిపోతున్నాడు. రోడ్డుమీదికొచ్చిన వారికి మంట పుట్టిస్తున్నాడు. సాధారణానికి మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు వచ్చే మూడు నెలల్లో మండనున్న ఎండలకు సంకేతమేనని చెబుతున్నారు. ఈసారి ఏప్రిల్, మే నెలలు అగ్గి పుట్టించడం ఖాయమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఈసారి వడదెబ్బ కేసులు, మరణాలు కూడా పెరిగే అవకాశం ఉండడంతో రెవెన్యూ, వైద్యారోగ్య శాఖలు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.