: రేపు మీ భార్య, మీ పిల్లలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోవచ్చు!: బస్ ప్రమాద ఘటనపై జగన్
కృష్ణా జిల్లా నందిగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముళ్లపాడు బస్సు ప్రమాద ఘటన బాధితులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డ్రైవర్ మృతదేహానికి పోస్టు మార్టం చేయలేదని అన్నారు. మరోవైపు రెండో డ్రైవర్ కనిపించకుండా పోయాడని వ్యాఖ్యానించారు. ‘నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కనీసం డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేదా? అని కూడా చూడరు. ఈ రోజు వారు.. రేపు అదే బస్సుల్లో మీ భార్య, మీ పిల్లలు, మన భార్యాపిల్లలు ఇదే పరిస్థితికి గురవుతారు’ అని జగన్ వ్యాఖ్యానించారు.
‘కేశినేని, దివాకర్ ట్రావెల్స్ ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నాయి. కనీసం 20 లక్షల రూపాయలను పరిహారంగా ట్రావెల్స్ యాజమాన్యం ప్రకటించాలి. తప్పు చేసిన వారిని అందరూ ప్రశ్నించండి. 120-150 కిలోమీటర్ల వేగంతో బస్సు నడిపారు. 2, 5 లక్షల రూపాయల పరిహారం కాదు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు 20 లక్షల రూపాయలకు తక్కువ రాకూడదు. లేదంటే బస్సు యాజమాన్యాలు ఇటువంటి ప్రమాద ఘటనల పట్ల నిర్లక్ష్యం వహిస్తాయి.. మరో ప్రమాదానికి కారణమవుతాయి. చంద్రబాబు నాయుడు ఈ ట్రావెల్స్ ను దగ్గరుండి మరీ సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఆయా యజమాన్యాలు రూల్స్ అతిక్రమించి ప్రవర్తిస్తున్నాయి’ అని జగన్ విమర్శించారు.