: ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం తప్పే: కిరణ్ రిజిజు
కొన్ని రోజులుగా ఢిల్లీ యూనివర్శిటీ కేంద్రంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ఆ ఆందోళనలకు కాంగ్రెస్, వామపక్షాలే కారణమని ఆరోపించారు. సదరు పార్టీల నాయకులు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అన్నారు. భారత దేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉందని అన్న ఆయన.. దేశంలో ఎవరయినా ప్రధానమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు కానీ దేశానికి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడడం తప్పేనని పేర్కొన్నారు. గతంలో జరిగిన చైనా-భారత్ యుద్ధ సమయంలో కాంగ్రెస్, వామపక్షాలు చైనాకు మద్దతు పలికాయని ఆరోపించిన కిరన్ రిజిజు అటువంటి పార్టీల నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు.