: చార్మినార్ పై సెల్ఫీ దిగిన పర్యాటకుడు అరెస్ట్
చార్మినార్ పై సెల్ఫీ తీసుకుంటున్న పర్యాటకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వ్యక్తి పేరు నవీన్ (40). కర్ణాటక నుంచి వచ్చాడు. ఓ జ్యువెలరీ షాప్ ను నిర్వహిస్తున్నాడు. పోలీసుల కథనం ప్రకారం, నిన్న చార్మినార్ సందర్శనకు వచ్చిన అతను... మొదటి అంతస్తులో సెల్ఫీలు దిగాడు.
అయితే, చార్మినార్ పై సెల్ఫీలు దిగడాన్ని నిషేధించారు. సెల్ఫీలు దిగుతూ పలువురు ప్రమాదాలకు గురవుతుండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అంచుల వద్దకు పర్యాటకులు వెళ్లకుండా, బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ బ్యారికేడ్లను కూడా దాటి, నవీన్ సెల్ఫీలు దిగాడు. దీంతో, అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది, అతడిని పోలీసులకు అప్పజెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి, ప్రమాదకర ప్రదేశంలో సెల్ఫీలు దిగాడని ఫిర్యాదు చేశారు.