: శశికళపై మరో వార్... 12 మంది ఎంపీలతో రాష్ట్రపతి వద్దకు పన్నీర్ సెల్వం
శశికళ వర్గంపై తన యుద్ధాన్ని మరోసారి పన్నీర్ సెల్వం ప్రారంభించారు. తనకు మద్దతుగా నిలిచిన 12 మంది ఎంపీలతో ఆయన నేడు రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 1:30కి ఆయనకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ దొరికింది. తమిళనాడులో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులు వివరించి, రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో జయలలిత మృతిపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా విచారణ చేయించాలని కూడా ఆయన కోరనున్నట్టు సమాచారం. ఈ నెల 18న అసెంబ్లీలో జరిగిన రభస, వివాదాస్పద వాతావరణం నేపథ్యంలో బల నిరూపణ జరిగిన పద్ధతిపైనా ఆయన వివరించే అవకాశాలు ఉన్నాయి. కాగా, పన్నీర్ తో పాటు 10 మంది లోక్ సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఢిల్లీకి వెళ్లినట్టు వి.మైత్రేయన్ వెల్లడించారు. కాగా, డీఎంకే సైతం మరోసారి బల నిరూపణకు ఆదేశించాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.