: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టులో పడిన దివాకర్ ట్రావెల్స్ బస్సు.. నలుగురు దుర్మరణం
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద అదుపుతప్పి కల్వర్టులో పడింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నందిగామ, జగ్గయ్యపేట ఆస్పత్రులకు చేర్చి చికిత్స అందిస్తున్నారు. రహదారిపై నుంచి బస్సు ఒక్కసారిగా కిందపడడంతో అది కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో ప్రయాణికులను బయటకు తీయడం కష్టంగా మారింది. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.