: సాక్ష్యాలు లేవు... యూరీ ఉగ్రదాడి అనుమానితులను విడిచిపెట్టనున్న ఎన్ఐఏ

యూరీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి తరువాత, ఎన్ఐఏ అరెస్ట్ చేసిన ఇద్దరు పాకిస్థానీ యువకులను తిరిగి ఆ దేశానికి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. జైషే మొహమ్మద్ ముష్కరులకు వీరిద్దరూ సైనిక స్థావరం వద్దకు దారి చూపారన్నది వీరిపై ఉన్న ప్రధాన అభియోగం కాగా, విచారణలో సైతం వారు అదే విషయాన్ని అంగీకరించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతం నుంచి సెప్టెంబర్ 18న యూరీలోకి వీరు వచ్చినట్టు ఎన్ఐఏ కేసు పెట్టగా, దానికి సరైన సాక్ష్యాలను మాత్రం సంపాదించలేకపోయింది.

దీంతో ఫైజల్ హుస్సేన్ అవాన్, అహ్సాన్ ఖుర్షీద్ అనే యువకులను మానవతా దృక్పథంతో తిరిగి పాకిస్థాన్ కు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. పొరపాటున పాక్ భూభాగంలోకి ప్రవేశించిన భారత జవాను చందు చవాన్ ను పాక్ తిరిగి అప్పగించిన సంగతి తెలిసిందే. ఆపై పాక్ తో మరింత స్నేహాన్ని కోరుతూ, భారత్ వీరిద్దరినీ విడిచిపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించాలని, ఇద్దరు యువకులపై సాక్ష్యాలు లేని కారణంగా వీరిని దేశం నుంచి పంపించేయాలని ఎన్ఐఏ ముగింపు నివేదికలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుకు రిపోర్టును ఇచ్చినట్టు హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నివేదికను కోర్టులు అంగీకరిస్తే, వీరిద్దరినీ పంపేందుకు మార్గం సుగమమవుతుందని ఓ అధికారి తెలిపారు.

More Telugu News