: కర్ణాటక ప్రభుత్వం నుంచి రాహుల్ కార్యాలయానికి ముడుపులు.. కలకలం సృష్టిస్తున్న ఎమ్మెల్సీ డైరీ
కాంగ్రెస్ అధిష్ఠానం మనిషిగా ముద్రపడిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ డైరీ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యాలయానికి పెద్ద మొత్తంలో ముడుపులు వెళ్లాయని అందులో ఉంది. వారం క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్సీ గోవిందరాజులు ఇంట్లో ఐటీశాఖ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అధికారులు ఓ డైరీ, పలు పత్రాలు, పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు.
డైరీలోని కొన్ని పత్రాలు గురువారం బయటకొచ్చాయి. వాటి ప్రకారం దాదాపు 12 మంది కర్ణాటక మంత్రుల పేరిట అధిష్ఠానానికి ముడుపులు అందాయి. ముడుపులు అందుకున్న వారిలో సీనియర్ నేత అహ్మద్ పటేల్, రాహుల్ గాంధీ కార్యాలయం, మోతీలాల్ వోరా ఉన్నారు. అయితే ఐటీ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. బయటపడిన పత్రాల్లో రూ.65 కోట్ల ముడుపులకు సంబంధించిన లెక్కలున్నాయి. తాజా డైరీతో ఇటు కర్ణాటక, అటు కాంగ్రెస్ అధిష్ఠానంలో కలకలం మొదలైంది. ఒక్క రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్, వోరాలకే రూ.50 కోట్ల వరకు ఇచ్చినట్టు డైరీలో రాసి ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.