: పళనిస్వామి అద్దె కుర్చీలో కూర్చున్నారు: కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ ఎద్దేవా
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ విధేయుడు, తమిళనాడు సీఎం పళనిస్వామి ఎంతో కాలం ఆ పదవిలో ఉండరని కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ అన్నారు. సొంత ఇంట్లో సొంత కుర్చీలో కూర్చోవడానికి, అద్దె కుర్చీలో కూర్చోవడానికి చాలా తేడా ఉంటుందని చెప్పారు. వేరొకరి సీట్లోనే పళనిస్వామి కూర్చున్నారని తాను భావిస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీలో బల పరీక్ష జరిగిన తీరు అత్యంత దారుణమని అన్నారు. ప్రతిపక్షాలు లేకుండానే బల నిరూపణ చేస్తారా? అంటూ ప్రశ్నించారు.
బల నిరూపణ సమయంలో డీఎంకే ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై ఎంక్వైరీ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. అంకెల రూపంలో పళనిస్వామి మెజారిటీని నిరూపించుకున్నా... నైతికంగా మాత్రం ఆయన ఓడిపోయారని ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కూడా కల్పించలేదని విమర్శించారు. అసెంబ్లీలో జరిగిన ఘటనతో యావత్ తమిళనాడు సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారు.