: సీన్ రివర్స్... భారత్ పై ప్రశంసల జల్లు కురిపించిన చైనా
చైనా తన మాటను మార్చింది. ఒకే వాహక నౌక ద్వారా 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో తనశక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన విషయం తెలిసిందే. దీంతో అంతరిక్ష సాంకేతిక రంగంలో ఏ దేశానికీ తీసిపోనని నిరూపించింది. అయితే, భారత్ సాధించిన ఈ భారీ విజయాన్ని మొదట్లో చిన్న విజయమే అంటూ వ్యాఖ్యలు చేసిన చైనా ఈ రోజు భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. భారత్ తమ దేశం కంటే కూడా గొప్ప పనిచేసిందంటూ అక్కడి పలు పత్రికలు పేర్కొంటున్నాయి.
వాణిజ్య ఉపగ్రహాలను అతితక్కువ ధరకే అంతరిక్షంలోకి పంపించే విషయంలో భారత్ తమ దేశం కంటే ముందుందని ఆ దేశ మీడియా పేర్కొంది. భారత్ ను చూసి తాము అంతకంటే వేగంగా ముందుకు వెళ్లాలని చైనా తమ శాస్త్రవేత్తలకు సూచనలు చేసిందని ఆ దేశ మీడియా చెప్పింది. విరివిగా అంతరిక్ష యాత్రలు చేపట్టడం ద్వారా, వాణిజ్య ఉపగ్రహాలను పంపించడం ద్వారా తమ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఇస్రో సాధించిన ఘనతను అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇప్పటికే పలు దేశాలు ప్రశంసించాయి. స్పేస్ బిజినెస్‌లో ప్రపంచ వ్యాప్తంగా తాము కూడా రేసులో ముందున్నామని భారత్ బాగా చూపించగలిగిందని చైనా అధికారి ఒకరు చెప్పారు.