: అభిమానిస్తే ప్రేమిస్తాడు.. తనలోని మరో కోణాన్ని బయటపెట్టుకున్న ట్రంప్!
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అనేక మందికి దడ పుట్టిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆయన వైఖరి సామాన్యులనే కాదు కొన్ని దేశాలను సైతం కలవరపరుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తనలోని మరో కోణాన్ని ట్రంప్ బయటపెట్టుకున్నారు. తనను అభిమానించే వారిని గుండెల్లో పెట్టుకుంటానని చాటి చెప్పారు. వివరాల్లోకి వెళ్తే, ప్రజల మధ్యలో తాను ప్రసంగిస్తుండగా... జనాల్లో ఉన్న ఓ వ్యక్తిని వేదికపైకి పిలిచారు ట్రంప్. ఆయన పిలుపుకు వెంటనే స్పందించిన హంబర్ అనే వ్యక్తి బారియర్స్ పై నుంచి దూకి, వేదికపైకి వెళ్లాడు. అంతేకాదు, ట్రంప్ ను అభిమానంగా హత్తుకున్నాడు. ఈ చర్యను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక సామాన్యుడు వచ్చి అధ్యక్షుడిని హత్తుకోవడమా? అంటూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారికి అసలు విషయం తెలిసింది.
జీన్ హంబర్ అనే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ కు వీరాభిమాని. ట్రంప్ ఆరడుగుల కటౌట్ ను తన ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రతి రోజు ట్రంప్ కు ఆయన శాల్యూట్ చేస్తాడు. తనను గుర్తించిన తన అభిమాన నాయకుడు తనను వేదిక మీదకు పిలవడంతో హంబర్ ఎంతో సంతోషానికి గురయ్యాడు. ఎన్నికల సమయంలో తమ కోసం ఇచ్చిన హామీలను ట్రంప్ నిలబెట్టుకుంటారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఓ కారు షోరూంలో హంబర్ సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. అయితే, కాకతాళీయంగా హంబర్ ను ట్రంప్ పిలిచారా? లేక ఇది ముందుగానే ప్లాన్ చేసుకున్న వ్యవహారమా? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఏదేమైనప్పటికీ ఒక్క రోజులో హంబర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.