: వైసీపీని వదిలి టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే కల్పనకు కష్టాలు!
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరి ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు కష్టాలను తెచ్చి పెడుతున్నాయి. వైకాపా టికెట్ పై గెలిచి, ఆపై నియోజకవర్గ అభివృద్ధి అంటూ, టీడీపీలో చేరిన ఆమెను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య వర్గంతోనే సమస్యలు వస్తున్నట్టు తెలుస్తోంది. అధినేత బుజ్జగింపుతో మెత్తబడ్డట్టు కనిపించిన వర్ల, ఆపై పరిస్థితులు మారుతున్నాయన్న అనుమానంతో గ్రూపు రాజకీయాలకు తెరలేపగా, ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలు బయటపడిన సంగతి తెలిసిందే.
వర్ల రామయ్యకు రాష్ట్ర స్థాయి పదవి ఉన్నందున, తనకు పామర్రు అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్డు రావద్దని కల్పన కోరుతుండగా, వర్ల అండతో కొందరు గ్రూపులుగా మారి కలెక్షన్లు ప్రారంభించినట్టు పార్టీ వర్గాలే చెబుతుండటం గమనార్హం. ఇక గతంలో టీడీపీ నేతగా ఉన్నప్పటి నుంచి నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకుని, ఇప్పుడు లోకేష్, బాలకృష్ణలతో సన్నిహిత సంబంధాలు నెరపుతూ, నియోజకవర్గానికి మరిన్ని నిధుల కోసం ప్రణాళికలు వేస్తూ, ముందుకు సాగుతున్న ఆమెకు ఈ గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు కష్టాలను తెచ్చి పెడుతున్నాయి.