: ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దు: పీవీ సింధు
‘అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన హైదరాబాద్ 'వాలీబాల్ ప్లేయర్' పీవీ సింధు’ అంటూ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ వ్యాఖ్యానించడంపై పలు విమర్శలు తలెత్తాయి. ముఖ్యంగా సింధు అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో సింధు తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది.
‘ఎమ్మెల్యే సార్, నన్ను ఉద్దేశించి వాలీబాల్ ప్లేయర్ అనలేదు. మా నాన్న కూడా స్టేజ్ పై ఉండటంతో, జాతీయ వాలీబాల్ ప్లేయర్ అని అనాల్సివచ్చింది. ఎమ్మెల్యే సార్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దు. థ్యాంక్యు’ అని తన ట్వీట్లలో సింధు పేర్కొంది. కాగా, రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతంలో 5 కే రన్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీవీ సింధు హాజరైంది. ఇదే కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. ఆర్గనైజర్లకు, స్టేజ్ పై ఉన్న వారికి తన ధన్యవాదాలు తెలిపే క్రమంలో సింధును ఉద్దేశించి ఆ ఎమ్మెల్యే వాలీబాల్ క్రీడాకారిణి అని అన్నారు.