: ‘షారూక్ భాయ్.. ఖానా.. ఖానా’ అంటూ ఓ బిచ్చగాడి ఆక్రందన.. చలించిపోయిన బాలీవుడ్ బాద్షా!
‘షారూక్ భాయ్.. ఖానా.. ఖానా’ అంటూ బాలీవుడ్ బాద్ షా షారూక్ ముంగిట ఓ బిచ్చగాడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో, కరిగిపోయిన, షారూక్, ఆ బిచ్చగాడికి తిండి ఏర్పాట్లు చూడాలంటూ తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల ముంబయిలో ఈ సంఘటన జరిగింది. మరుగుజ్జు పాత్రకు సంబంధించిన ఓ కథపై చర్చించే నిమిత్తం ముంబయిలోని ఓ రెస్టారెంట్ కు షారూక్ వెళ్లాడు. అనంతరం, బయటకు వచ్చిన షారూక్ తన కారు ఎక్కబోతున్న సమయంలో ఓ బిచ్చగాడు అక్కడికి వచ్చి ‘తింటానికి తనకు ఏదైనా ఇప్పించమని’ ప్రాధేయపడ్డాడు.
దీంతో, అతడిని ఆప్యాయంగా పలకరించి, అతనికి ఆహారం అందించాలని తన భద్రతా సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరింది. దీంతో, తమ అభిమాన నటుడు తన మానవత్వం చాటుకున్నాడంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, దర్శకుడు ఎల్. రాయ్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో షారూక్ మరుగుజ్జు పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.