: ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బు లేదు... తుదివరకూ తమ్ముడితోనే: ఆనం వివేకా
తన సోదరుడికి తెలియకుండా తాను ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు వచ్చిన వార్తలను నెల్లూరు తెలుగుదేశం నేత ఆనం వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. తన తమ్ముడితో ఎటువంటి విభేదాలు లేవని, జీవితాంతం ఇద్దరమూ కలిసే ఉంటామని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి విజయానికి కృషి చేస్తున్నామని అన్నారు. పట్టాభి నామినేషన్ సందర్భంగా తాను లేనని, సోదరుడితో గొడవ వచ్చినట్టు వచ్చిన వార్తలను ఖండిస్తూ, ఆ సమయంలో తాను చంద్రబాబు వద్ద ఉన్నానని, తిరుగు ప్రయాణంలో నెల్లూరుకు వస్తున్న సమయంలో రామనారాయణ విజయవాడకు వస్తుండగా, దారి మధ్యలో కలిసి మాట్లాడుకున్నామని తెలిపారు. తమలో ఎవరికి పదవి వచ్చినా మరొకరు అడ్డుకోబోరని, ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. తనకూ ఎమ్మెల్సీ కావాలనే ఉందని, అయితే, గవర్నర్ లేదా ఎమ్మెల్యేల కోటాలో వస్తే తీసుకుంటానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేంత ఆర్థిక బలం తన వద్ద లేదని చెప్పారు.