: గెలిచింది పళని... సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం స్టాలిన్!
తమిళనాడు అసెంబ్లీలో గందరగోళ పరిస్థితుల మధ్య పళనిస్వామి బలపరీక్షలో గెలిచినప్పటికీ, విపక్ష నేత స్టాలిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారని, అందరి దృష్టీ తనపై పడేలా చూడటంలో విజయం సాధించారని జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. ఓటింగ్ కు ముందే స్టాలిన్ అసెంబ్లీ నుంచి బయటకు రాగా, ఆయన చొక్కా చిరిగిపోయి ఉన్న సంగతి తెలిసిందే. అతనితో పాటు ఇతర డీఎంకే సభ్యులూ దాదాపు అదే స్థితిలో కనిపించారు. తమను అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొట్టించారని, అసెంబ్లీ నుంచి బలవంతంగా గెంటివేశారని చెబుతూ, చిరిగిన చొక్కాను చూపిస్తున్న దృశ్యాలను నేడు దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ దినపత్రికలూ ప్రచురించాయి. రహస్య ఓటింగ్ ను మాత్రమే తాము కోరామని, దాన్ని అంగీకరించలేదని చెప్పిన ఆయన, ఆపై మెరీనా బీచ్ వద్ద నిరాహార దీక్షకు దిగగా, పోలీసులు అరెస్ట్ చేసి తరలించిన సంగతి తెలిసిందే. ఈ బలపరీక్ష అసలైనదేనా? పళనిస్వామి సీఎంగా ఉండాలా? వద్దా? అన్న విషయాలను ప్రజలే తేలుస్తారని ఈ సందర్భంగా స్టాలిన్ వ్యాఖ్యానించారు.