: ఓటేసే ముందు ఒక్కసారి ‘అమ్మ’ను తలచుకోండి.. ఎమ్మెల్యేలకు పన్నీర్ పిలుపు
మరికొన్ని గంటల్లో విశ్వాస పరీక్ష జరగనున్న నేపథ్యంలో ‘అమ్మ’ను గుర్తుకు తెచ్చుకుని ఓటేయాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ప్రజలు జయలలితను చూసే అన్నాడీఎంకేకు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. కుటుంబ పాలనకు జయ పూర్తిగా వ్యతిరేకమని, ఓటేసే ముందు అమ్మను గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని కుటుంబ పాలన నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే ‘అమ్మ’ ప్రభుత్వానికి, నమ్మిన ప్రజలకు ద్రోహం చేసినట్టు అవుతుందన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా ఓటేస్తారని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. విశ్వాస పరీక్షలో కనుక పళనిస్వామి నెగ్గితే కనుక రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజాకోర్టులో ఎమ్మెల్యేలను నిలబెట్టేందుకు పన్నీర్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇదివరకే ఓపీఎస్ ప్రకటించారు.