: వధువు మెడలో అన్నకు బదులు తాళికట్టిన తమ్ముడు.. పరువు నిలబెట్టిన వైనం!
ముహూర్త సమయానికి వధువో, వరుడో మారిపోవడం సాధారణంగా సినిమాల్లోనే కనిపిస్తుంది. కానీ నిజం పెళ్లిలోనూ ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లాంలో గురువారం రాత్రి జరిగిన వివాహంలో ఈ వింత జరిగింది. వరుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అమ్మాయిని విశాఖపట్టణంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాలని నిశ్చయించారు. పెళ్లి కోసం ఏర్పాట్లు ఘనంగా చేశారు. గురువారం రాత్రే పెళ్లి. అందరూ ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.
ఈలోగా పెళ్లింటికి చేరుకున్న కానిస్టేబుల్ ప్రియురాలు తనకు న్యాయం చేయాలని కోరింది. అక్కడి పెళ్లి ఏర్పాట్లు చూసి షాకై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రియురాలిని వివాహం చేసుకునేందుకు పెళ్లి కొడుకు అంగీకరించాడు. మరోవైపు ముందే కుదిర్చిన వివాహాన్ని ఆపి అప్రతిష్ఠ మూటగట్టుకోవడం ఇష్టం లేని వరుడి తల్లిదండ్రులు చిన్నకుమారుడితో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. కుటుంబ గౌరవం కోసం అన్న చేసుకోవాల్సిన అమ్మాయి మెడలో అతడు తాళికట్టడంతో శుభం కార్డు పడింది.