: సెంట్రల్ జైలులో ఖైదీల 'బ్యూటీ సెలూన్'!
తిరువనంతపురంలోని పూజప్పుర సెంట్రల్ జైలు ఖైదీల ఆధ్వర్యంలో నిర్వహించే ఓ బ్యూటీ సెలూన్ అందుబాటులోకి రానుంది. బ్యుటీషియన్లుగా శిక్షణ పొందిన ఖైదీలు ఈ సెలూన్ ను నిర్వహిస్తారని, త్వరలోనే ప్రారంభిస్తామని జైలు సూపరింటెండెంట్ ఎస్.సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జైలు సమీపంలో వినియోగంలో లేని ఓ భవనం ఉందని, దీనిని బ్యూటీ సెలూన్ గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పురుషులకు మాత్రమే ఉద్దేశించిన ఈ సెలూన్ ఎయిర్ కండిషన్డ్ అని, వచ్చే ఏప్రిల్, మే మధ్యలో దీనిని ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ఈ బ్యూటీ సెలూన్ లో హెయిర్ కట్, హెయిర్ డయింగ్, షేవింగ్, స్పా, ఫేసియల్, పెడిక్యూర్, మేనిక్యూర్, ఫుట్ మసాజ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సీనియర్ సిటిజన్లు, అల్జీమర్స్, మధుమేహ తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రత్యేక సేవలు అందిస్తామని, తక్కువ ధరకే తమ బ్యూటీ సెలూన్ లో సేవలు పొందవచ్చని సంతోష్ పేర్కొన్నారు.
తిరువనంతపురంలోని కన్నూరులో ‘ఫినిక్స్ ఫ్రీడమ్ ఎక్స్ ప్రెషన్స్’ పేరుతో ఈ తరహా బ్యూటీ సెలూన్ ఇటీవల ప్రారంభించారని, తమది రెండోదని, శిక్ష పూర్తయిన ఖైదీలు బయటకు వెళ్లిన తర్వాత ఈ రంగంలో ఉపాధి పొందవచ్చనే ఉద్దేశంతో బ్యూటిఫికేషన్ కోర్సులో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. తిరువనంతపురంలోని రెండు పాలిటెక్నిక్ కళాశాలలలో ఈ కోర్సుకు సంబంధించిన శిక్షణను ఖైదీలు తీసుకుంటున్నారని సంతోష్ తెలిపారు.