: అవినీతి కేసులో ... కోర్టులో లొంగిపోయిన హిందీ టీవీ నటుడు
‘కుసుమ్’, ‘కుంకుమ్’ టీవీ సీరియళ్ళతో ఆదరణ పొందిన ప్రముఖ హిందీ బుల్లి తెర నటుడు అనూజ్ సక్సేనా ఢిల్లీ కోర్టులో లొంగిపోయారు. ఎల్డర్ ఫార్మాస్యూటికల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్న అనూజ్ కు ఢిల్లీ కార్పొరేట్ అఫైర్స్ మాజీ డైరెక్టర్ జనరల్ బీకే బన్సల్ అవినీతి కేసులో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు సీబీఐ ఆరోపించింది. సుమారు 24 వేల మంది మదుపరుల నుంచి 175 కోట్ల రూపాయలను చట్ట విరుద్ధంగా డిపాజిట్ల రూపంలో సేకరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అంతే కాకుండా తన కంపెనీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయకుండా ఉండేందుకు, బన్సల్ కు లంచం ఇవ్వడంలో కూడా అనుజ్ దే కీలక పాత్ర అని సీబీఐ స్పష్టం చేసింది. ఈ పెట్టుబడులను విదేశాల్లో కంపెనీలకు మళ్లించి, సకాలంలో రిటర్న్ లు దాఖలు చేయలేదని సీబీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17లోపు కోర్టులో సరెండర్ కావాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యేక జడ్జీ గుర్దీప్ సింగ్ ముందు ఆయన లొంగిపోయారు.