: ఆ సైట్లను తొలగించండి.. నా వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడింది!: ‘సుప్రీం’కు ఓ మహిళ వినతి
ఇంటర్ నెట్ లో అడ్డూ అదుపు లేకుండా లభ్యమయ్యే అశ్లీల వీడియోలు, పోర్న్ సైట్లపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు ఓ మహిళ విన్నవించుకుంది. ఈ మేరకు ఓ పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త ఈ పోర్న్ సైట్లను, వీడియోలను చూస్తున్నాడని, దీంతో, తన వైవాహిక జీవితం, కుటుంబం ఇబ్బందుల్లో పడ్డాయని ముప్ఫై సంవత్సరాల ఈ మహిళ వాపోయింది.
రెండేళ్ల నుంచి తన భర్త పోర్న్ సైట్లకు అలవాటు పడ్డారని, దీంతో, తన వైవాహిక జీవితానికే కాకుండా, తమ ఇద్దరి పిల్లలకూ కూడా ఇబ్బంది ఏర్పడిందని ఆ పిటిషన్ లో ఆమె పేర్కొంది. తమ వివాహమై ముప్ఫై సంవత్సరాలు అవుతోందని, తాను సామాజిక కార్యకర్తను అని పేర్కొన్న ఆ మహిళ, ఈ సైట్లు, వీడియోలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత విద్యావంతుడు అయిన తన భర్త లాంటి వాళ్లే ఈ తరహా సైట్లకు అలవాటు పడుతున్నారని, ఇక, యువత ఎటువంటి చెడు మార్గంలో పయనిస్తుందో ఆలోచించాలని ఆ పిటిషన్ లో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు.