: బస్సు రోకో, రైల్ రోకో చూశాం.. చంద్ర‌బాబు పాల‌న‌లో విమానాల రోకో చూస్తున్నాం: జ‌గ‌న్


ప్రత్యేక హోదా పోరాటాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ద‌గ్గ‌రుండి కత్తితో పొడుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. ఈ రోజు గుంటూరులోని నల్లపాడులో నిర్వహించిన 'యువభేరి' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... ప్ర‌త్య‌క హోదా కోసం చంద్ర‌బాబు నాయుడు పోరాటం చేయకపోగా చేసేవాళ్లను కూడా అణిచేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర యువ‌త‌ ధర్నాలు చేస్తే దగ్గరుండి ధర్నాలను నీరుగార్చే కార్యక్రమాలను చంద్రబాబు చేయిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. పోరాటంలోకి దిగితే పిల్లలని కూడా చూడకుండా వాళ్ల మీద పీడీ యాక్ట్ పెట్టాలని చంద్ర‌బాబు ఆదేశిస్తున్నార‌ని అన్నారు.

గ‌త‌నెల‌ 26న శాంతియుతంగా విశాఖ‌ప‌ట్నంలో కొవ్వొత్తులతో ర్యాలీలు చేయాలని చూస్తే, ర్యాలీలో పాల్గొనకుండా త‌న‌ను సైతం విమానాశ్ర‌యంలో అడ్డుకున్నార‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. బస్సు రోకో, రైల్ రోకోల‌ను ఇప్ప‌టివ‌ర‌కు చూశామ‌ని, అయితే చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌లో విమానాల రోకో కూడా చూస్తున్నామ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. గతంలో రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ ను తన స్నేహితుడు బ్రూటస్ కత్తితో వెన్నుపోటు పొడిచినప్పుడు ''యూ టూ.. బ్రూటస్'' అంటాడ‌ని, ఇప్పుడు అదే ప‌ద్ధ‌తిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి  హోదా పోరాటానికి వెన్నుపోటు పొడిచినప్పుడు యావత్ తెలుగుజాతి ''నువ్వు కూడానా చంద్రబాబూ'' అని ప్రశ్నిస్తోందని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా హోదా కోసం పోరాటం కొన‌సాగిస్తామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News