: భయపెట్టే గదులు, కంపుకొట్టే టాయిలెట్లు... జైలు జీవితం శశికళకు అంత ఈజీ కాదు!


పరప్పన అగ్రహార జైలు... దాదాపు 40 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద జైళ్లలో ఒకటి. ఇదే జైల్లో ఇప్పుడు శశికళ ఉన్నారు. జైలు జీవితం ఆమెకు కొత్త కాకపోయినా, అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడున్న స్థితి వేరు. 2014లో జయలలితతో పాటు ఇదే జైలుకు వచ్చిన శశికళ, అప్పట్లో ప్రత్యేక హోదాను జైల్లో అనుభవించారు. ప్రైవేటు గది, ఫ్యాన్, 24 గంటలూ నీరు వచ్చే టాయిలెట్ తదితర సౌకర్యాలు పొందారు. ఇప్పుడలా కాదు. మిగతా ఖైదీలతో సమానంగా ఆమె కూడా ఉండాలి. బ్యారక్ లోని టాయిలెట్లో రోజుకు గంట పాటు మాత్రమే నీరు వస్తుంది. తెల్లవారుజామున టాయిలెట్ అలవాటు లేకుంటే, ఆపై వాటిని వాడటం అంత సులువు కాదు. రోజంతా అవి కంపు కొడుతూనే ఉంటాయి.

ఇక ఉదయం లేచిన తరువాత మిగతా వారితో సమానంగా రోజంతా తనకు అప్పగించిన పనిని ఆమె చేయాల్సి వుంటుంది. జైలు నుంచే పార్టీ కార్యకలాపాలు చక్కబెట్టాలన్న ఆమె వ్యూహానికి ఈ నిబంధన అడ్డంకిగా నిలవవచ్చని తెలుస్తోంది. శశి ప్రత్యేక ఖైదీ కాదు కాబట్టి, ఆమెను స్పెషల్ గా చూస్తే, ఆ వార్త వెంటనే బయటకు పొక్కిపోతుంది. ములాఖత్ లు కూడా ఎక్కువగా ఉండవు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, నేతలు ఎవరు వచ్చినా పరిమితంగానే రావాల్సివుంటుంది.

ఇక ఈ జైలుకు గత మూడేళ్ల నుంచి సున్నం కూడా వేయలేదు. పెద్ద పెద్ద గోడలున్న ఓ మురికివాడలా జైలు లోపలి పరిస్థితులు ఉంటాయని, తొలిసారి దీన్ని చూస్తే, భయపడాల్సిందేనని ఇక్కడికి వెళ్లి వచ్చిన వారు చెబుతారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఆమెకు స్పెషల్ క్లాస్ ఖైదీ హోదా వచ్చేలా చూడటం, లేకుంటే, తమిళనాడులోని ఏదైనా జైలుకు తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేయాలని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News