: పిలుపెవరికి?... తమిళనాడు గవర్నర్ ముందున్న 5 ఆప్షన్లివి!


నిన్నటి వరకూ క్షణానికో మలుపు తిరుగుతూ వచ్చిన తమిళ రాజకీయాలు నేడో, రేపో కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా గవర్నర్ విద్యాసాగర్ రావు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే, ఆయన ముందు 5 ఆప్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది.
వాటిల్లో మొదటిది, రాజ్యాంగ నిబంధనల ప్రకారం, అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎన్నికై, తనకు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలముందని చెబుతూ లేఖనిచ్చిన ఎడప్పాడి పళనిస్వామిని ఆహ్వానించడం. అయితే, ఆయన సమర్పించిన లేఖపై గవర్నర్ సంతృప్తి చెందాల్సి వుంటుంది.
ఇక రెండో ఆప్షన్ కు వస్తే, తనకు అవకాశం ఇస్తే, సభలోనే బలాన్ని నిరూపించుకుంటానని చెబుతున్న పన్నీర్ సెల్వంకు అవకాశం ఇవ్వడం. ఎమ్మెల్యేలను రిసార్టులో బంధించి వుంచి బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారన్నది ఆయన ఆరోపణ. ఆయన తన తరఫున లేఖ కూడా ఇవ్వలేదు. అయితే, రాజీనామా చేసినప్పటికీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నందున గవర్నర్ తన విశేషాధికారాలతో పన్నీర్ ను బల నిరూపణకు ఆహ్వానించవచ్చు.
మూడవ ఆప్షన్ గా తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి కాంపోజిట్ బలపరీక్షకు ఆదేశించడం. ఇదే జరిగితే, పళనిస్వామి, పన్నీర్ సెల్వంల బలం అందరి ముందూ తేలిపోయి, ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఎవరిదన్నది స్పష్టమైపోతుంది.
నాలుగో ఆప్షన్ ఏంటంటే, అన్నాడీఎంకే సభ్యులు చీలిపోయి ఎవరికీ పూర్తి మెజారిటీ రాని పక్షంలో 89 మంది ఎమ్మెల్యేలతో ప్రస్తుతం రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న డీఎంకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, అసెంబ్లీలో బల నిరూపణకు ఆదేశాలు ఇవ్వడం. ఇదే జరగాలంటే, పన్నీర్ సెల్వం తన మద్దతు ఎమ్మెల్యేలంతా డీఎంకే వెనకే ఉన్నామని లేఖ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక గవర్నర్ విద్యాసాగర్ ముందున్న ఆఖరి ఆప్షన్, అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, రాష్ట్రపతి పాలన విధించడం. ఎవరికీ మెజారిటీ లేదని ఆయన భావించి, అసెంబ్లీలో కూడా అదే తేలిన తరువాతే ఈ అంశం తెరపైకి వస్తుంది.

  • Loading...

More Telugu News