: స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాష్ లైట్ ఉపయోగిస్తున్నారా.. జాగ్రత్త! నిపుణుల హెచ్చరిక
పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానం మనిషి అవసరాలని తీర్చుకునే క్రమంలో ఎంతగా ఉపయోగపడుతుందో అంతే ప్రమాదకారిగా కూడా మారుతోంది. మనచుట్టూ దొంగలు ఉండరు.. కానీ, మనకు తెలియకుండానే మనకు సంబంధించిన కీలక సమాచారం నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. సైబర్ నేరగాళ్లు చేస్తున్న పనుల ధాటికి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఇతరుల కీలక సమాచారాన్ని చోరీ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లోని ఫ్లాష్ లైట్ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. వెలుతురు సరిగా లేనప్పుడు సెల్‌ఫోన్‌లోని ఫ్లాష్ లైటుని ఆన్‌చేసి డాక్యుమెంట్లను చదువుతుంటాం. కానీ, అలా చేయడం ఏమాత్రం మంచిది కాదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్లాష్ లైట్ కోసం ప్రత్యేకంగా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే యాప్‌లలో సైబర్ నేరగాళ్లు మాల్‌వేర్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు. యూజర్ ఫ్లాష్‌లైట్ ఆన్ చేయగానే కెమెరా.. ఆడియో సెన్సర్లు కూడా అంతర్గతంగా పనిచేస్తాయని, అప్పుడు మనం ఏదైనా డాక్యుమెంటు ఆ వెలుతురు కింది పెడితే దాన్ని కెమెరా స్కాన్ చేసేసి హ్యాకర్లకు చేరవేస్తుందని హెచ్చరిస్తున్నారు. అలా కీలకమైన పత్రాలను స్కాన్ చేసేసి సైబర్ నేరగాళ్లు నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ అధ్యక్షుడు షింజోఅబే ఇద్దరూ ఓ ప్రైవేట్ క్లబ్‌లో సమావేశమై చర్చిస్తున్నప్పుడు వారి సహాయకులు ఫోన్ ఫ్లాష్‌టైట్ ఆన్ చేస్తే ఆ వెలుతురులోనే వారు పలు డాక్యుమెంట్లను చదివారు. ఇలా వారు ఫ్లాష్ టైట్‌ను వినియోగించడం సరికాదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశంపై స్పందించిన అమెరికా రక్షణశాఖ ట్రంప్ ఇప్పటికీ భద్రతలేని వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌నే వాడుతున్నారా? అనే అంశాన్ని పరిశీలిస్తోంది.