: చెలరేగిపోతున్న అవినీతి ఆందోళన కలిగిస్తోంది.. శశికళ తీర్పులో జస్టిస్‌ అమితవ్‌ రాయ్‌ కీలక వ్యాఖ్యలు

అక్రమాస్తుల కేసులో శశికళ బృందాన్ని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేకంగా రాసిన ఏడు పేజీల తీర్పులో సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ అమితవ్ రావ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా సంపద పోగేసుకోవాలనుకునే దురాశాపరులు రాజ్యాంగానికి వెన్నుపోటు పొడుస్తున్నారని, సమాజంలో చెలరేగిపోతున్న అవినీతి ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అవినీతిపరుల్లో తప్పు చేశామన్న అపరాధ భావం మచ్చుకు కూడా కానరావడం లేదన్నారు. సమాజంలో ఇటువంటి వారిది పైచేయి అవడం వల్ల నిజాయతీపరులకు దిక్కు తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేన్సర్‌లా విజృంభిస్తున్న అవినీతిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని  పిలుపునిచ్చారు. అవినీతి అంటురోగంలా మారి జనజీవనంలో ప్రబలుతోందని రాయ్ పేర్కొన్నారు. శిక్షపడుతుందనే భయం కూడా లేని లెక్కలేని తనం అవినీతిపరుల్లో పెరిగి పోతోందన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న, ఊపిరాడనివ్వకుండా ప్రాణాలు తీస్తున్న బహిరంగ అవినీతిని జన బాహుళ్యం నుంచి తరిమికొట్టేందుకు వ్యక్తిగత, సమష్టి జోక్యం అనివార్యమని జస్టిస్ రాయ్ తీర్పులో పేర్కొన్నారు. మనస్సాక్షి, నైతిక పరిపక్వత, సమతౌల్యంతో వ్యవహరించి చట్టాల పవిత్రతను కాపాడుకోవాలని, లేదంటే అత్యున్నతమైన న్యాయం అపాయంలో పడుతుందని రాయ్ పిలుపునిచ్చారు.

More Telugu News