: జయలలితపై తూటా సంధిస్తే శశికళ బలి... కేసు పూర్వాపరాలివే...!
దివంగత ముఖ్యమంత్రి జయలలితపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంధించిన తూటాకు శశికళ బలైంది. దాని వివరాల్లోకి వెళ్తే... 1987లో జయలలిత మొత్తం ఆస్తుల విలువ 7.5 లక్షల రూపాయలు. ఈ ఆస్తిలో అధిక భాగం ఆమె తల్లి ఎన్‌ఆర్ సంధ్య నుంచి వారసత్వంగా వచ్చింది. దాంతో పాటు లక్ష రూపాయల నగదు జయలలిత వద్ద ఉంది. అదే సంవత్సరం ఎంజీఆర్ మరణించారు. దీంతో జయలలిత పూర్తి స్థాయి రాజకీయాల్లో ప్రవేశించి, క్రియాశీలకం అయ్యారు. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 1991 ఎన్నికల్లో గెలిచిన ఆమె, అధికారం చేపట్టారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఆమె కేవలం రూపాయి వేతనం తీసుకున్నారు. అంతకు ముందు అంటే 1989-90లో ఆమె ప్రకటించిన అదనపు ఆస్తులేమీ లేవు.
దీంతో 1996లో జయలలిత ఓటమిపాలైన వెంటనే...1991 తరువాత ముఖ్యమంత్రిగా రూపాయి వేతనం తీసుకున్న ఆమె ఆస్తులు అకస్మాత్తుగా ఎలా పెరిగాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. 1990-91 నాటికి 1.89 కోట్లకు ఎలా పెరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. అలాగే ఈ ఆస్తులు 1991-92 నాటికి 2.60 కోట్ల రూపాయలకు, 1992-93 నాటికి 5.82 కోట్ల రూపాయలకు, 1993-94 నాటికి 91.33 కోట్ల రూపాయలకు, 1994-95 నాటికి మరో 38.21 కోట్ల రూపాయలు ఎలా పెరిగాయంటూ 1996లో జనతాపార్టీ అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్య స్వామి జయలలిత అక్రమాస్తులపై కేసు వేశారు. ఆ సమయంలో ఆయన ఫిర్యాదులో శశికళ, ఇళవరసి, సుధాకరన్ ల పేర్లు లేవు. ఈ ఫిర్యాదుపై చెన్నైలోని ప్రత్యేక కోర్టు దర్యాప్తుకు ఆదేశించింది. అంతే, వెంటనే ఆ ఏడాది డిసెంబర్ లో జయలలితను అరెస్టు చేసి, పొయెస్ గార్డెన్ లోని వేద నిలయంలో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో ఊహించని రీతిలో దేశం మొత్తం తమిళనాడువైపు చూసేలా భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. వాటితోపాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ ల పాత్రపై కూడా ఆధారాలు లభించాయి. దీంతో వెంటనే ఏ2గా శశికళ, ఏ3గా వి.ఎన్.సుధాకరన్, ఏ4గా శశికళ వదిన జె.ఇళవరసిని చేర్చారు. ఈ నలుగురిపై 1997 జూన్ లో చార్జ్ షీట్ నమోదు చేశారు. దీంతో చార్జిషీట్ లో పేర్కొన్న అభియోగాల నుంచి తమను మినహాయించాలంటూ శశికళ, ఇళవరసి, సుధాకరన్ లు కోర్టుకు దరఖాస్తు చేశారు. దీనిని అక్టోబర్ 1997లో న్యాయస్థానం కొట్టివేసింది. వారు కూడా నిందితులేనని పేర్కొంది.
అంతే కాకుండా ఈ ముగ్గురూ 66.65 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారని, అందులో సింహభాగం వారి పేర్లపైనే ఉన్నాయని, 32 వ్యాపారాలు కూడా వారి పేరిట ఉన్నాయని, అవన్నీ అక్రమాస్తులతోనే ప్రారంభించారని కోర్టు పేర్కొంది. అనంతరం అనేక మలుపులు తిరిగిన ఈ కేసుల విచారణ ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో పూర్తైంది. ఆ రకంగా సుబ్రహ్మణ్య స్వామి జయలలితపై సంధించిన తూటా శశికళకు తగిలింది. ముఖ్యమంత్రి పీఠమెక్కేందుకు సిద్ధంగా ఉన్న శశికళ ఏకంగా రాజకీయాలకే దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా, శశికళ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సుబ్రహ్మణ్య స్వామి బలంగా మద్దతివ్వడం విశేషం.