: పన్నీర్ సెల్వం రాజీనామా వెనక్కి తీసుకోవచ్చా?... ఎలా?


పన్నీర్ సెల్వం తన రాజీనామాను వెనక్కి తీసుకోవచ్చా? అంటే అవుననే అంటున్నారు న్యాయనిపుణులు. ప్రస్తుతం తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వం జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అనూహ్యంగా ఆయన పదవీత్యాగం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో పెను కుదుపు చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే తాను ముఖ్యమంత్రి అయి తీరుతానంటూ శశికళా నటరాజన్ భీష్మించుకుని కూర్చుంది. పన్నీర్ సెల్వం తనకు అవమానం జరిగిందంటూ ప్రజల ముందుకు వచ్చారు. దీంతో క్యాంపు రాజకీయాలు చోటుచేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో రోజుకో ఉత్కంఠ రేపిన తమిళ రాజకీయాల్లో తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానంటూ ఆయన ఎత్తుగడ వేస్తే... దానిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దానికి బలం చేకూరేలా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆయన జయలలిత సమాధి వద్దకు వెళ్లి మౌనదీక్ష చేసి, ఆ తరువాత మన్నార్ గుడి మాఫియాపై ఆరోపణలు సంధించారు. ఈ నేపథ్యంలో ఆయనను కుట్రపూరితంగా మోసం, బలవంతం లేదా అనుచిత ప్రభావంతో ముఖ్యమంత్రి పదవికి తనతో రాజీనామా చేయించారని నిరూపిస్తే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించే అవకాశం ఉందని మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి ఒకరు తెలిపారు.

ఈ నేపథ్యంలో పార్టీ శాసనసభా పక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకోవడంతో వారిద్దరి బలపరీక్షకు గవర్నర్ అవకాశం ఇస్తారని వారు పేర్కొంటున్నారు. అలా జరిగితే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠానికి దూరం కావడం ఖాయం. ఇలాంటి పరిస్థితే 1984లో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాదెండ్ల భాస్కరరావును సీఎంగా నియమించిన సందర్భంలో ఎదురైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News