: శశికళకు ఎందుకు మద్దతు తెలిపారు? దీని వెనకున్న కుట్ర ఏంటి?: సుబ్రహ్మణ్యస్వామిని ఏకి పారేస్తున్న నెటిజన్లు
మేధావిగా పేరుగాంచిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి... తలతిక్క మనిషిగా కూడా అంతే పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారు. అనునిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సుబ్రహ్మణ్యస్వామిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించిన తర్వాత ట్విట్టర్ వేదికగా సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తూ, "20 ఏళ్ల తర్వాత నేను గెలిచాను" అంటూ తెలిపారు. శశికళకు శిక్ష పడుతుందనే విషయం తనకు ముందే తెలుసని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆయనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శశికళకు శిక్ష పడుతుందని ముందే తెలిసినప్పుడు... ఆమెకు మెజారిటీ ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆమెను వెంటనే ఆహ్వానించాలని, లేకపోతే కోర్టులో రిట్ పిటిషన్ వేస్తానని ఎందుకు వ్యాఖ్యానించారని నిప్పులు చెరుగుతున్నారు. శశికళకు మద్దతు ఎందుకు తెలిపారు? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి? అంటూ ప్రశ్నలతో సుబ్రహ్మణ్యస్వామిని ఏకి పారేస్తున్నారు.