: కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు... తమిళనాడులో పెరిగిన ఉత్కంఠ.. సాయంత్రమే గవర్నర్ నిర్ణయం ప్రకటన
జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె నెచ్చెలి, చిన్నమ్మ శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్ సహనిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది. శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో ఈ తీర్పు ఎలా ఉంటుందన్న విషయంపై రాజకీయ వర్గాలే కాకుండా తమిళనాడు ప్రజానీకం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. చెన్నైలో భారీగా పోలీసులను మోహరింపజేసి భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ తీర్పు అనంతరం ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలనే అంశానికి సంబంధించి గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రోజు సాయంత్రానికి తన నిర్ణయం వెలువరిస్తారని తెలుస్తోంది. శశికళ దోషిగా తేలితే ఆమె భవితవ్యం ఏమిటి? తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికవుతారు? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మన్నార్‌గుడి మాఫియా విధ్వంసానికి పాల్పడవచ్చని భావిస్తోన్న అధికారులు తమిళనాడులో 20 వేల మంది పోలీసులను రంగంలోకి దించిన విషయం తెలిసిందే.