: హిందుపురంలో బాలకృష్ణ కొత్త పీఏ నియామకం!
హిందుపురంలో బాలకృష్ణ కొత్త పర్సనల్ సెక్రటరీని నియమించుకున్నట్టు తెలుస్తోంది. తీవ్ర విమర్శలు వచ్చిన శేఖర్ స్థానంలో హైదరాబాద్ టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కృష్ణమూర్తిని నియమించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. కడప జిల్లా కమలాపురం ప్రాంతానికి చెందిన కృష్ణమూర్తి, పార్టీ జిల్లా కార్యదర్శిగా, ప్రధాన కార్యాలయం కార్యదర్శిగా పనిచేస్తూ, మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కృష్ణమూర్తి కార్యక్రమాల కమిటీ ఇన్ చార్జిగా, ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యుడిగా ఉన్నారు. మొదటి నుంచి బాలకృష్ణకు ఆయన వీరాభిమాని. ఆయన పెద్ద కుమార్తె వివాహం దశాబ్దం క్రితం జరిగితే, అప్పట్లోనే బాలకృష్ణ వివాహానికి హాజరయ్యారు. ఈ నేపథ్యమే కృష్ణమూర్తిని ఎంపిక చేసుకునేందుకు సహకరించిందని తెలుస్తోంది. నేడు ఆయన హిందుపురంలో బాధ్యతలు తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.