: పన్నీర్‌కు జై కొట్టిన రాఘవలారెన్స్.. ఇంటికెళ్లి ఆలింగనం
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సినీ పరిశ్రమ నుంచి మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓపీఎస్‌కు అండగా నిలవగా ఇప్పుడు ఆ వరుసలో ప్రముఖ దర్శకుడు, డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ కూడా మద్దతు ప్రకటించారు. సోమవారం రాత్రి చెన్నైలోని గ్రీన్‌వేస్ రోడ్డులో ఉన్న ఓపీఎస్ ఇంటికి వెళ్లి తన మద్దతు తెలిపారు. ఇంటికొచ్చిన లారెన్స్‌కు ఓపీఎస్ సాదర స్వాగతం పలికారు. ఆత్మీయ ఆలింగనాల తర్వాత ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను క్షణ్ణంగా పరిశీలించాక ఓపీఎస్‌కు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు లారెన్స్ పేర్కొన్నారు. జయలలిత ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలిగే సత్తా ఒక్క ఆయనకు మాత్రమే ఉందని లారెన్స్ కితాబిచ్చారు.