: బీజేపీ 36 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసింది: ఇరోం షర్మిళ సంచలన ఆరోపణ
తనకు బీజేపీ 36 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిందని మణిపూర్ పోరాట యోధురాలు ఇరోం షర్మిల ఆరోపించారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఆమె మాట్లాడుతూ, మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్ పై తౌబాట్ నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరపున పోటీ చేయాలని.. దీక్ష ముగించిన తరువాత రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన అనంతరం తనను కలసిన బీజేపీ నేత తనతో బేరసారాలు ఆడారని అన్నారు. ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలంటే చాలా డబ్బు అవసరమవుతుందని కూడా చెప్పారని ఆమె తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థి వద్ద కనీసం 36 కోట్ల రూపాయలు ఉండాలని సూచించారని ఆమె చెప్పారు.
తాను చెప్పినట్టు ఆయనపై పోటీకి దిగితే ఆ డబ్బు కేంద్రం ఇస్తుందని, ఒకవేళ కేంద్రం జాప్యం చేస్తే, ఆ డబ్బును తాను సమకూరుస్తానని ఆయన తనకు బంపర్ ఆఫర్ ఇచ్చారని ఇరోం షర్మిల వెల్లడించారు. అయితే తన విధానాలకు, అలాంటి ఆఫర్లకు తాను వ్యతిరేకమంటూ తిరస్కరించానని ఆమె తెలిపారు. కాగా, ఆమె ఆరోపణలను బీజేపీ ఖండించింది. తమ పార్టీపై ఆమె చేసిన ఆరోపణలకు ఆధారాలను చూపకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మణిపూర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి (అడ్మినిస్ట్రేషన్) తొంగమ్ బిశ్వజిత్ సింగ్ హెచ్చరించారు.